Powered By Blogger

Tuesday, 3 December 2013

రుధిర సౌధం 16

           
                                             

                                                               రుధిర సౌధం 
                                                                                     (డిసెంబర్ 2 తేది తరువాయి భాగం )

    తాళం తీసి తలుపులు మెల్లిగా లోపలికి తోసింది రచన .. సవ్వడి కేమో లోపలున్న గబ్బిలాలు ఒక్కసారిగా ఎగిరిపోయాయి . క్షణం ఆమె పాదాలు సన్నగా కంపించాయి .. ధైర్యం గుండెల్లో నింపుకొని మెల్లిగా లోపలకి ప్రవేశించింది .. తలుపులు తెరుచుకోవడం తో లోపలకి వచ్చిన వెలుగు తప్ప మరే వెలుగూ రావటం లేదు .. బూజు పట్టేసిన పాత కాలం నాటి ఫర్నిచెర్ .. దుమ్ము అరంగుళం మేర పేరుకు పోయి ఉంది .. విశాల మైన హాలు .. మధ్యలో పొడవైన మెట్లు మొదటి అంతస్తు లోకి వెళ్ళటానికి .. చీమ చిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దం ..
అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లిగా ఆణువణువూ పరీక్ష గా చూస్తుంది రచన . గోడలకి ఉన్న పెయింటింగ్ పైదుమ్ము పేరుకుపోయి ఉండటం తో .. సరిగ్గా కనబడటం లేదు ..

పురాతన మైనప్పటికి చాల విలువైన వస్తువులు వున్నాయి .. తన చేతిలో ఉన్న కీ చైన్ కెమెరా తో ఆణువణువూ  చిత్రిస్తూ ముందుకు నడుస్తున్నదామె .
హాల్ కి ఇరువైపులా గదులు ఉన్నాయి .. అన్నింటికీ తలుపులు వేసి ఉన్నాయి .. ఒక గది తలుపులు మెల్లిగా నెట్టింది .. తలుపులు బార్లా తెరుచుకున్నాయి .. చాలా విశాల మైన గదిలో ఉన్న డైనింగ్ టేబుల్ ని చూసి ఆశ్చర్యం తో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి . .. అంట పెద్ద టేబుల్ ని ఆమె ఇది వరకెన్నడు చూసి ఉండలేదు .. సుమారు 100 మంది ఒకేసారి భోజనం చేయవచ్చు దానిపై . .. కాని అది కూడా దుమ్ము తో నిండిపోయి ఉంది .. గది లోంచి బయటకి వచ్చి పక్క గది తలుపుల్ని ముందుకి నెట్టింది .. గదిలో ఉన్న వస్తువులని బట్టి రాచ కుటుంబం సంగీత ప్రియులని అర్థమయింది . ఒక వీణ ,తబలా ,మృదంగాలు .. తదితర సంగీత పరికరాలు ఉన్నాయి అందులో . గోడకి ఉన్న ఏడడుగుల పెయింటింగ్ దుమ్ము తో నిండియున్నా పెయింటింగ్ లో ఉన్నది
సరస్వతీ దేవి యని తెలియవస్తున్నది .. .. ఆమె పెయింటింగ్ కేసి అబ్బురం గా చూసింది ..

ఇంతలో ఏదో కిందపడిన శబ్దం వినబడింది . ఆమె మెదడు చురుగ్గా పనిచేసింది ... శబ్దం వినబడింది మొదటి అంతస్తు లో .. పరుగున మెట్లెక్కి శబ్దం వినబడిన వైపు నడిచింది రచన .. పూల గుత్తులను పెట్టుకునే ఇత్తడి జాడీ కింద పడింది .. దానికి కొంచెం దూరం లోనే ఉన్న ఎలక కనబడింది రచన కి .. ఓహ్ నువ్వా ! పని చేసింది .. అని దాన్ని లేపి నిలబెట్టింది .. అప్రయత్నంగా  ఆమె ద్రుష్టి అక్కడున్న గది పై పడింది .. తలుపుల్ని ముందుకి తోసింది .. తెరుచుకోలేదు .. మళ్లి గట్టిగా తోసింది .. ఈసారి తలుపుల్ని తోయగానే అవి దభాలున తెరుచుకున్నాయి .. లోపల్నించి ఉవ్వెత్తున గాలి తరంగం ఆమె మీదికి దూసుకు వచ్చింది .. విసురుగా ఆమె పక్క కి ఎగిరిపడింది . అమ్మా !గట్టిగా అరచింది రచన .. ఆమె గొంతు భవంతి లో ప్రతిధ్వనించింది .. అసలే దెబ్బ తగిలిన చేయి కావటం తో నొప్పి తారస్థాయి కి వెళ్ళింది .  

మెల్లిగా లేవటానికి ప్రయత్నించింది .. కాని ఆమె చేతులకి చల్లగా ఏదో తగిలిన భావన .. హతాశురాలయి నేల వంక చూసిన రచన నిర్ఘాంత పోయింది .. అక్కడంతా రక్తం .. ధార గా ప్రవహిస్తుంది .. రక్తం వైపు నుండి వస్తుందో చూసింది .. తలుపులు తీసిన గది నుంచి .. ధారలయి ప్రవహిస్తుంది .. ఆశ్చర్యం తో చూస్తూనే తన చేతుల వంక చూసింది రచన .. ఆమె చేతుల నిండా రక్తం .. ఆమె చేతులు రక్తం తో తడిసి పోయాయి .. నో .. భయం తో గట్టిగా అరచింది రచన .. రక్తం స్థాయి పెరుగుతూనే ఉంది .. అతికష్టం మీద లేచి నిలుచుంది ఆమె .. దాదాపు ప్రదేశం అంతా రక్తమే .. మెట్లమీద నుంచి కింద హాల్లోకి ప్రవహిస్తుంది ..
తన కాళ్ళ ముందు జరుగుతున్నది నిజమో కాదో తేల్చుకోలేక పొతున్నదామె. మరి కాసేపు అక్కడ ఉంటె రక్తం లోనే మునిగి ప్రాణాలు పోతాయేమో అనిపించింది రచన కి .. ఆలోచన వచ్చిందే తడవుగా .. ఆమె పరుగున మెట్లు దిగి హాల్లో కి వచ్చింది .. క్షణం ఆలస్యం చేయకుండా బయటికి పరుగుతీసింది .. మహల్ నుండి ఊరి వైపు విచక్షణారహితం గా పరుగుతీసింది రచన .


                                                                                                                       

                                                                                                                                       (ఇంకా ఉంది )

No comments: