Powered By Blogger

Tuesday, 3 December 2013

రుధిర సౌధం17

                               రుధిర సౌధం 
                                                                       (3వ తేది తరువాయి భాగం ) 


పరిగెత్తి పరిగెత్తీ అలసిపోయి అలసట తో నేల మీద కూల బడిపోయింది రచన . శరీరం కంపిస్తోంది .. వగరుస్తూ మళ్లి తన చేతుల వంక చూసింది .. మళ్ళి ఆశ్చర్యం తో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి .. ఆ రక్తం ఒక్క చుక్క కూడా ఆమె చేతులపై కానీ ,వొంటి పై కానీ లేదు . ఓ క్షణం ఆమె మనసు లో సందిగ్ధత నెలకొంది . భ్రమ కాదు కదా .. నిజం గా నేనా మహల్ లోకి వెళ్లాన ?లేదా ? మరి నా కళ్ళు చూసింది నిజమేనా ? ఆ రక్తపు ధారల జాడ నా వొంటి పై మచ్చుకైనా కనబడటం లేదే .. అంటే ఇదంతా నా భ్రమా .. ఏంటో అంతా అయోమయం గా ఉంది .. ఆమె మనసు పరిపరి విధాల పోతుంది ..
భ్రమ కాదు .. నువ్వు చూసింది నిజం .. భయంకరం గా గర్జించింది ఓ స్వరం .
తుళ్లిపడి చూసింది రచన తన ముందున్న ఆ భీకర ఆకారాన్ని .. అతడు ఆమె మహల్ లో కనిపించిన వాడు ..
నువ్వా ?? ఆశ్చర్యం గా అడిగింది రచన ..
నేనే ... ఆ మహల్ లోకి వెళ్లావు .. మహల్ తలుపులు తీసావు .. వెళ్ళు .. మూసి వెయ్యి ఆ తలుపులు .. గట్టిగా అన్నాడతను .
ఏం .. నీకెలా తెలుసు?అన్ని చూసినట్లు మాట్లాడతావు ? అసలు ఎవరు నువ్వు ? ఆవేశం గా లేచి నిలబడి అంది రచన .
నేనెవరో .. తెలుసుకోవటం కంటే ఆ మహల్ తలుపులు మూసు కోవటం ముఖ్యం .. అర్థం కాదా ? ఈ ఊరికి విపత్తు తెచ్చావని నిన్ను ఊరి వారు ఉరి వేయక ముందే .. వెళ్లి తలుపులు మూసి రా .. అన్నాడతను కర్కశం గా .
ఆమె అతడి వైపు అయోమయం గా చూసింది .
లేదంటే ఇవ్వు .. ఆ తాళం చెవి .. నేను ఆ మహల్ తలుపులు మూసి వస్తాను .. అన్నాడు అతడు .
అప్పుడు గుర్తొచ్చింది ఆమె కి తాళం చెవి .. తాళం కప్పు కె ఉంచేసిన సంగతి .. ఆమె మొహం లో భావనలు చదివినట్లు గా .. అక్కడే ఉంది కదూ ..  నువ్వు పో ఇక్కడ్నించి .. నేను వేస్తాను ఆ తలుపుల్ని .. అని పెద్ద పెద్ద అంగల్లో మహల్ కేసి సాగి పోయాడతను . ఓ క్షణం అతడు వెళ్ళిన వైపు అయోమయం గా చూస్తూ ఉండి పోయింది రచన . ..
ఇంతలో ఆమె ముందు రత్నం రాజు జీప్ ఆగింది ..
ధాత్రీ .. ఎక్కడకి వెళ్లావు ? నువ్వెంత  సేపటికి రాక పోయేసరికి కంగారు పడి నిన్ను వెతుక్కుంటూ వచ్చేసాను .. అంటూ ఆమె దగ్గరికి వచ్చాడు .
ఆమె అతని వంక దీనం గా చూసింది ..
ఏంటి ??అలా ఉన్నావు?ఏం జరిగింది ?ఆమె మొహం లో బేల తనం చూసి కంగారు గా అడిగాడు రత్నం .
అతని ప్రశ్నలకి తనలో తానె తమాయించుకొని .. ఏం లేదు రాజు గారూ .. ఏం లేదు .. బాగా అలసిపోయాను అంతే .. అంది రచన .
అవునా ? సరే .. బంగ్లా కి వెళదామా ? అన్నాడు రత్నం రాజు .
అలాగే అని తల ఊపి .. మహల్ వంక మళ్ళి చూసింది రచన . దూరం గా కనిపించాడు ఆ వ్యక్తి మహల్ కేసి నడుస్తూ ..
రాజు గారూ .. ఆ దూరం గా వెళ్తున్న వ్యక్తి ఎవరు ? అంది అటు వైపు చేయి చూపిస్తూ ..
ఆమె చూపించిన వైపు చూసిన అతడు ఆశ్చర్యం గా ఆమె వంక చూసి .. ధాత్రీ .. ఎవరు ? నాకెవరు .. కనిపించడం లేదే .. అన్నాడు రత్నం రాజు ..
వ్వాట్ ? సరిగ్గా చూడండి .. అక్కడ ఒక వ్యక్తి దూరం గా మహల్ వైపు నడుస్తున్నాడు గా .. ఆయన మీకు కనిపించడం లేదా ? కంగారుగా అడిగింది రచన .
మళ్ళి .. ఆవైపు చూసి .. కాస్త భయం గా ధాత్రీ .. నాకెవరు కనబడటం లేదు .. కానీ ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు .. త్వరగా జీప్ ఎక్కు .. ఇక్కడ నుంచి త్వరగా వెల్లిపోదాం .. అని గభాలున జీప్ ఎక్కి కూర్చున్నాడు .
రచన ఆశ్చర్యం గా .. నిజం గా మీకతను కనబడటం లేదా ? అంది దీనం గా ..
లేదు ధాత్రీ  .. నేను చెబుతున్నది నిజం .. నీ మాటలు వింటుంటే నాకెందుకో భయం గా ఉంది .. రా త్వరగా జీప్ ఎక్కు .. వెల్లిపోదాం .. వణుకుతున్న స్వరం తో అన్నాడు రత్నం రాజు .
ఆమె కేమీ అర్థం కాలేదు .. మ0త్రముగ్ధురాలిలా వెళ్లి జీప్ లో కూర్చుంది .. కానీ ఆమె మెదడు లో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి ..
ఆమె కూర్చోగానే జీప్ ని వెనక్కి తిప్పి బంగ్లా కేసి పోనిచ్చాడు రత్నం రాజు .
ఆమె ఆలోచిస్తోంది .. ఏం జరుగుతోందో అర్థం కావటం లేదు .. నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయా ?ఎలా ?నేను చూసింది నా పక్కనే ఉన్న ఈ రత్నం కి కనబడలేదా ? లేక ఇతను అబద్ధం చెబుతున్నాడా ?ఎందుకో యితడు అబద్ధం చెబుతున్నట్టు అనిపించడం లేదు ... మరైతే నిజమేది ?అతగాడు ఎవరు ? నా ప్రతి చర్య ని గమనిస్తున్నట్టు ఎలా మాట్లాడ గలుగుతున్నాడు ? తాళం చెవి కూడా వదిలేశాను .. అతడు మహల్ తలుపులు మూసి వేస్తాననడం నిజమేనా ?ఏది నిజం ?ఏది అబద్ధం ? జరుగుతున్నది కళ్ళకి వదిలేయాల ?మనసుతో చదివి చూడాలా ? మహల్ లో నేను చూసిన రక్తపు ధార అంత సడన్ గా ఎక్కడ్నుంచి వచ్చింది ?ఆలోచనలతో ... అంతు లేని సందేహాల భారం ఆమె తల వేడెక్కిపోయింది ..
ఆమె అలా ఏదో ఆలోచన లో ఉండటం గమనించిన రత్నరాజు .. ధాత్రీ .. అని పిలిచాడు .
అతని పిలుపుకి ఆలోచనల నుండి బయటకి వచ్చి .. హా .. అంది రచన .
నువ్వేదో చూడకూడనిది చూసి నట్లున్నావు .. నువ్వు నిలబడిన ప్రాంతం అంత మంచిది కాదు .. భయపడ్డావా ? అని ఆత్మీయం గా అడిగాడు అతను .
అదే0 లేదు రాజు గారూ .. మీరేం ఆలోచించకండి .. నేను దారి తప్పి పోయి అక్కడకి వెళ్ళిపోయాను . . అంది రచన .
పోనీ ఎందుకన్నా మంచిది .. ఊరికి అటు చివర ఆంజనేయస్వామి గుడి ఉంది .. ఒకసారి వెళ్దామా ?అన్నాడు రత్నం .
మీరనుకున్నంత అవసరం లేదు కాని గుడి అంటే కాదనలేను .. వెళ్దాం పదండి .. అంది రచన .
సరే .. అని గుడి వైపు జీప్ ని పోనిచ్చాడు రత్నం రాజు
                                                                                                                        (ఇంకా ఉంది )No comments: