Wednesday, 4 December 2013

రుధిర సౌధం 18 (4వ తేది తరువాయి భాగం )రుధిర సౌధం    
(4వ తేది తరువాయి భాగం ) 

వేద మంత్రాల ఘోష తో ఆ ప్రాంతమంతా హోరెత్తి పోతోంది . గిరిజ మనసులో ఆ జగత్జనని ని ప్రార్థిస్తుంది .. కళ్ళు మూసుకుని నిశ్చలం గా ఉన్నా .. ఆమె మోము లో విషాద మేఘాలు మాత్రం అలముకునే ఉన్నాయి .
స్వామీజీ మంత్రోచ్చారణ చేస్తూనే పూజా స్థలి మధ్యలో ముగ్గు వేసి నవధాన్యాల నడుమ ఉన్న బంగారు కలశాన్ని చూసారు ..  అతని వదనం అప్రసన్నం గా మారింది . ఆమ్మా .. ఇదేనా నీ నిర్ణయం .. బిడ్డ కోసం తండ్రి ఆయుష్షు ప్రదానం చేసాడు . ఇప్పుడు తల్లి కూడా .. రచన కి ఇది వరమా ?శాపమా తల్లీ ? వరమయినా ,శాపం ఐనా ,నేను  కర్తవ్యాన్ని విస్మరించలేను .. మహాత్ములయిన మా గురువు గారు అప్పగించిన ఈ కార్యం తప్పక నేను ఆచరించ వలసినదే కదా .. అని మనసులో అనుకోని .. పూజ లో నిశ్చలంగాకూర్చున్నగిరిజ వంక చూసి ..  అమ్మా .. గిరిజా .. ఇలా రా తల్లీ .. ఇలా వచ్చి ఈ పూర్ణ కుంభం ఎదురుగా ఉన్న ముగ్గు పై వచ్చి కూర్చో .. ఇక తప్పనిసరి .. మీ కులదేవత వైష్ణవీ మాత పూజ ఆరంభించక తప్పదు తల్లీ .. అన్నాడు మహర్షి .
ఆమె అతని వంక చిరునవ్వుతో చూసి లేచి వచ్చి అతను కుర్చోమన్న చోట ఆసీనురాలయింది .
నీవు నిండు మనసుతో ,సంపూర్ణ అంగీకారం తో ఈ పూజ కి సిద్ధమా తల్లీ .. అడిగాడు ఆయన .
స్వామీజీ .. ఓ తల్లి తన బిడ్డ నిండు నూరేళ్ళు బ్రతకాలని కోరుకుంటుంది .. అందుకు తన ప్రాణాల నయినా అర్పించేందుకు సిద్ధం అవుతుంది . ఇది లోకం లో సర్వ సాధారణ విషయమేగా స్వామీజీ .. మరి అలాంటి విషయం నా నోట వినాలని ఎందుకు భావించారు .. నేను రచన కి కన్నతల్లి ని . కన్నతండ్రి గా ఆయన చేసిన పని తల్లిగా నేను చేసేందుకు నిరాసక్తత చూపించ గలనా ? నేను సిద్ధం గా ఉన్నాను .. పూర్ణ కలశాన్ని అర్థిస్తున్నాను .. నా బిడ్డ ఆయుష్షు ని పెంచమని .. అంది గిరిజ స్థిరం గా .
అతడు ఆమె వంక ఆప్యాయం గా చూసి ""నిండు మనసుతో వైష్ణవీ దేవి ని ప్రార్థించు తల్లీ "నేను పూజ ఆరంభిస్తున్నాను .. అని కళ్ళు మూసుకొని మరల మంత్రోచ్చారణ మొదలుపెట్టారు .
                                                  ***************************

రచన తన గదిలో బెడ్ పై కూర్చుని విశ్రాంతి గా ఆలోచించ సాగింది .. ఆమె ఆ భయంకర వ్యక్తీ రత్నం రాజు కి కనబడక పోవటాన్ని నమ్మలేక పోతోంది ..
ఎవరతను ?ఈవుర్లో ఏ ఒక్కరు ఆ మహల్ వైపు వెళ్ళరు .. కాని అతడు కొన్నేళ్ళ నుండీ ఆ మహల్ లో ఉన్నా నంటున్నాడు .. అంతేకాదు ..
నా గురించి అతడు ఎలా మాట్లాదగలుగుతున్నాడు .. అతను అసలు మనిషేనా ?లేకపోతె ఆత్మా ?ఓ క్షణం ఆమె వొళ్ళు గగుర్పొడిచింది . ఎందుకో ఆమె కి సడన్ గా అతని మాటలు గుర్తుకొచ్చాయి .. "అతీత శక్తి ఉన్నదానవు .. కనుకనే ఈ మహల్ లోకి అడుగుపెట్టి కూడా ప్రాణాలు తో బయట పడ్డావు .. "

ఏంటి ?అతని ఉద్దేశ్యం ? నాకు అతీత శక్తులున్నాయ ?
నో ... అది నిజం కాదు .. ఒక మామూలు ఆడ పిల్ల ని నేను .. దీన్ని బట్టి చూస్తే అతను పిచ్చివాడే అయి ఉంటాడు
ఏదో వాడు వాగితే ఏదో కొంత నాకు చెందినట్లే అనిపించటం తో ఎక్కువ ఆలోచిస్తున్నానా ?ఇకపోతే రత్నం పిరికి వాడు .. మహల్ వంక చూడటానికే భయపడతాడు ..  అందుకే  అలా ఎవరూ కనబడలేదని చెప్పుంటాడు .. అనుకొని .. తృప్తి పడేలోగా మహల్ లో జరిగిన సంగతి గుర్తొచ్చింది .
నేననుకున్నట్టు అతను పిచ్చివాడే ఐతే .. నేను జరిగినదంతా నిజమా కాదా అని ఆలోచిస్తున్నప్పుడు .. అతడు నా మనసులో ఆలోచనలు గ్రహించినట్లే ప్రవర్తించాడు .. అవును .. తాళం చెవి కూడా .. అక్కడే వదిలేసానని నేను అతనితో అనలేదు .. కానీ అతనికి అర్థమయినట్లే వెళ్ళిపోయాడు .. అతను మహల్ కి తాళం వేసి ఉంటాడా లేదో ఇప్పుడు మళ్లి మహల్ కి వెళ్ళాలంటే ఎలా?అయినా నేనిలా ఎందుకు చేసాను ?మహల్ కి తాళం వేసి రావలసింది ..
 అనుకుంటూ విసురుగా బెడ్ మీద నుంచి లేచి గదికి దక్షిణాన ఉన్న కిటికీ దగ్గర బయటికి చూస్తూ నిలబడింది.
రేపు అమావాస్య .. అతడు నన్ను రేపు మహల్ కి రావొద్దని హెచ్చరించాడు .. అయినా అతనెవరు నన్ను హెచ్చ
రించంటానికి ?రేపు నేను వెళ్లి తీరాలి .. నన్ను హెచ్చరిస్తున్న ఇతడెవరో ,మహల్ లో నన్ను ఆటపట్టిస్తున్న ఆ శక్తి ఎవరో ?తేల్చుకోవాల్సిందే .. పౌరుషం గా మనసులో అనుకొన్న ఆమె కి సడన్ గా రమణ మహర్షి మాటలు గుర్తొచ్చాయి .. ""రానున్న ఆమావాస్య నాడు నిన్ను ఇది కాపాడుతుంది .. "అని ఆయన ఇచ్చిన తాయెత్తు ..
అంటే .. ఈ అమావాస్య  నాడు నాకు ప్రాణాపాయం ఉందా ?స్వామీజీ కి ముందే అది తెలిసి తాయెత్తు ఇచ్చారా ?
అంటే ఆ పిచ్చివాడి మాటలు కూడా నిర్లక్ష్యం చేయాల్సినవి కావు . ఎందుకైనా  మంచిది రేపు మహల్ దగ్గరకి వెళ్ళక పోవటమే మంచిదేమో .. లేదంటే నేను అమ్మ ని బాధ పెట్టిన దాన్ని అవుతాను .. అనుకొంది రచన
కాని ఈ లెక్కలేనన్ని సందేహాలు నన్ను నిలవ నీయటం లేదు .. మహల్ కి వెళ్ళకుండా నేనున్డలేనేమో .. తెలుసుకోవాలని ఉంది .. ఆ ప్రమాదం   ఎలాంటిదో .. రేపటి కోసం ఆత్రుత గా ఉంది .. అని ఆలోచిస్తూ కిటికీ లోంచి
 చూస్తున్న రచన కి మంచి నీళ్ళకి  కుండ తో వెళుతున్న సరస్వతి కనిపించింది .. ఈ వీధి అంటే సరస్వతి ఇంటి పెరడు ఇటే ఉంది కదూ .. ఈ సరస్వతి నాకు ఆ పిచ్చివాడి   గురించి ఏమయినా చెప్పగలదేమో .. ఓసారి అడిగి చూడాలి అనుకొంది మనసులో రచన .
(ఇంకా ఉంది )
 
No comments: