Powered By Blogger

Wednesday, 11 December 2013

రుధిర సౌధం23
తూర్పున వెలుగు కిరణాలు విచ్చుకుంటున్నాయి .. ఏవేవో మాటలు చెవిన పడటం తో తెల్లారుతుండగా నిద్రపోయిన రచన నిద్రాభంగం అయి లేచింది . కళ్ళు నులుముకుంటూ కిటికీ తలుపు తెరచి హాల్ లోకి తొంగి చూసింది . హాల్ లో ఎవరు లేరు వెంగమ్మ తప్ప .. ఆమె గుమ్మం వంక శ్రద్ధ గా చూస్తుండటం తో బంగ్లా బయటి నుండే ఆ మాటలు వినవస్తున్నాయని పించింది రచన .
లీలగా వినిపిస్తున్న ఆ మాటలు చెవులు రిక్కించి వింది .. చాలా మంది జనం ఉన్నట్లున్నారు బయట .
కొంపదీసి ఈ తంతు అంతా యశ్వంత్ వాళ్ళకోసం కాదు కదా .. వెంటనే తను వేసుకున్న నైట్ గౌన్ మీద నైట్ కోట్ ధరించి గది తలుపు తీసి బాల్కనీ వైపు హడావిడి గా  పరుగు తీసింది .
బాల్కనీ లోనుంచి కిందికి తొంగి చూస్తే బంగ్లా ముందు భాగం అంతా కనబడుతుంది .
ఆమె ఊహించి0ది నిజమే .. భూపతి ఇంటి ముందు ఓ చిన్న జన సమూహం ఉంది . భూపతి వారందరి ముందు దర్జా గా ఓ రాజసం ఒలకబోసే కుర్చీ లో కూర్చుని ఉన్నాడు ..
అతడి ముందు నిద్ర కళ్ళతో నిలబడి ఉన్నారు యశ్వంత్,శివ ,మురారి ,సత్య
ఓహ్ గాడ్ .. వీళ్ళే .. కానీ ఇంతపెద్ద మీటింగ్ ఎందుకు ? స్వగతం గానే అనుకుంది రచన .
చూడండీ ... మీరు మా అనుమతి లేకుండా ఈ ఊరిలోకి వచ్చారు ... పైగా ఆ మహల్ ముందు గుడారాలు వేసుకుని ఉన్నారు .. అసలు మీకు మా ఊరితో ఏం పని ? ఎవరు మీరంతా ? అడిగాడు భూపతి గంభీరం గా .
ఈ భారత  దేశం లో పౌరులంతా దేశమంతా  స్వేచ్చ గా ఎక్కడికన్నా వెల్లొచ్చు .. ఉండొచ్చు .. అంటే ఎవరి అనుమతులు అవసరం లేదు .. అన్నాడు శివ కాస్త ఆవేశం గా ..
చూడు అబ్బీ .. మీ మాటలు ఎక్కడన్నాచెల్లుతాయేమో కానీ ఇక్కడ కాదు .. ఈ ఊరిలో భూపతి మాటే శాసనం ... అన్నాడు భూపతి కటువుగా ..
అర్థమయింది .. ఇది ఏర్పరుచుకున్న రాజ్యమని .. కానీ భూపతి గారూ .. రాజులూ పోయారు .. రాజ్యాలూ పోయాయి ..   ఈ వూరు కూడా ఇండియన్ గవర్నమెంట్ పరిధి లోనే ఉంది .. ఇక్కడ కి రావటానికి మాకు ప్రభుత్వం నుండి అనుమతి ఉంది .. అంతే కాదు మేము పురాతత్వ శాఖ నుండి వచ్చాము . అంటే మీకు తెలిసే ఉంటుంది .. పురాతన  భవనాలు ,వస్తువులకోసం  పరిశోధన చేసేవారమని .. అన్నాడు యశ్వంత్ భూపతి కళ్ళ లోకి  సూ టిగా
చూస్తూ ..
కొంచెం భంగ పడినట్లు ఉన్నాడు భూపతి .. మొహం కందగడ్డ లాగా అయిపొయింది
. పైనుంచి ఇదంతా చూస్తున్న రచన యశ్వంత్ చతురత కి  నవ్వుకొంది ..
 చూడండీ ... భూపతి గారు మిమ్మల్ని వొట్టినే ఇన్ని ప్రశ్నలు వేయటం లేదు .. ఈ ఊరికి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి ... పైగా ఈరోజు అమావాస్య .. అమావాస్య నాడు ఈ ఊరిలో ఏ ఒక్కరు ఆ మహల్ వైపు వెళ్ళరు .. మీరేమో ఏకం గా అక్కడ  మకాం వేసేసారు .. అన్నాడో కతను ఆ గుంపు లోంచి ..
చూడు అబ్బీ .. ఈ ఊరికి ఏ ఒక్కరువచ్చిన మేమే ఆశ్రయం ఇస్తాము .. మీరు ప్రభుత్వం తరపు వారు అంటున్నారు కనుక మీ భాద్యత మేమే వహిస్తాము .. మీకు ఉండటానికి వసతి కల్పిస్తాము .. కాని ఆ మహల్ ఇలాంటి పరిశోధనలకి తగనిది . ప్రమాద కర మైనది .. ఒకసారి హెచ్చరించవలసిన బాధ్యత మాపై ఉంది .. అన్నాడు భూపతి గంభీరం గా .
అది  మా వృత్తి .. మాకు తప్పదు .. ఆశ్రయం కల్పిస్తామన్నందుకు ధన్య వాదాలు .. అన్నాడు యశ్వంత్ .
చిన్నగా  తల పంకించి .. బాలయ్య ... అని బాలయ్య ని  పిలిచాడు భూపతి ..
అతడు భూపతి ముందుకి రాగానే .. బాలయ్యా వీరికి ఆ దక్షిణం వీధి లో ఉన్న మన ఇల్లు చూపించు .. వీరు అందులోనే  ఉంటారు .. అన్నాడు భూపతి .
అలాగే నయ్యా అన్నాడు బాలయ్య .
థాంక్స్ .. అన్నాడు యశ్వంత్ ...
చూడు అబ్బీ .. మా వూరు వచ్చినారు .. వచ్చిన వారు వచ్చినట్టే పోవాలి .. అందుకే ఈ రాత్రి కటిక అమావాస్య .. నా మాట విని ఈ రాత్రి మహల్ వైపు వెళ్ళ మాకండి .. ప్రాణాలు పోతాయి ... అన్నాడు భూపతి ..
చిరునవ్వు తో తల ఊపి ... బాలయ్య  వంక చూసి .. బాలయ్యా ..  వెళ్దామా? అని మళ్ళి భూపతి వంక చూసి మేమిక వెల్లొస్తాము అన్నాడు యశ్వంత్ ..
చిన్నగా తల పంకించాడు భూపతి ..
యశ్వంత్ వాళ్ళు బాలయ్య వెనుక నడుస్తూనే ఎందుకో  ఓ సారి వెనక్కి చూసాడు యశ్వంత్ ..
బాల్కనీ నుండి చూస్తున్న రచనని చూసి కళ్ళతోనే పలకరించాడు యశ్వంత్ .
ప్రతిగా చిరునవ్వు నవ్వింది రచన
(ఇంకా ఉంది )

No comments: