Powered By Blogger

Friday, 13 December 2013

రుధిర సౌధం 24స్నానం ముగించుకొని డ్రెస్ కోసం సూట్ కేసు ఓపెన్ చేసింది రచన .
ఏ డ్రెస్ వేసుకోవాలి ? యశ్వంత్ నన్ను లాంగ్ వైట్ గౌన్ లో చూడటమంటే ఇష్టం .. నాకోసం తను ఈ వూరు వచ్చినందుకు తనకోసం కొంచెమైనా చేయాలి కదా .. అని సూట్ కేసు అంతా వెతికి మరీ ఆ గౌన్ తీసి వేసుకుంది రచన .
ఇష్టం గా అద్దం ముందు కూర్చుని అందం గా ముస్తాబయింది .. రెడీ అయాక చిందర వందర గా ఉన్న సూట్ కేసు లో బట్టలు సర్దుతుండగా .. అనుకోక్కుండా ఆమె దృష్టి సూట్ కేసు అడుగున ఉన్న తాయెత్తు మీద పడింది .. ఓహ్ ఇది స్వామీజీ ఇచ్చింది .. అని తన చేతిలోకి తీసుకొని పరీక్ష గా చూసింది .. ఎర్రని దారాల పోగు .. అక్కడక్కడ కుంకుమ ఇంకా దానికి అంటిపెట్టుకునే ఉంది .
ఆమె కి స్వామీజీ అన్న మాటలు గుర్తుకొచ్చాయి ..
"రాబోయే అమావాస్య నాడు ఇది నీకు రక్షణ గా ఉంటుంది . ఇది నీ చేతికి ధరించు ""' అన్న స్వామీజీ మాటలు ..
ఆమె ఆ తాయెత్తు అలానే పట్టుకొని బెడ్ మీద కూల బడింది . ఆమె కి బసవరాజు మాటలు కూడా గుర్తొచ్చాయి ..
దాదాపు ఇద్దరి మాటల సారాంశం ఒకటే .. ..
అంటే ఈ రోజు నాకు ఏమైనా ప్రమాదం జరగ బోతుందా ?  ఈ విషయం స్వామీజీ కి ముందే తెలుసా .. ?అందుకే నాకీ తాయెత్తు ఇచ్చారా ? అంత వరకు ఉత్సాహం గా ఉన్న ఆమె మనసు ఎందుకో దిగాలు పడిపోయింది ..
ఎటువంటి ప్రమాదం నాకు జరగదు .. అందుకే స్వామీజీ నాకీ తాయెత్తు ఇచ్చారు .. అనుకొని చేతులు రెండు జోడించి మనసులో వైష్ణవీ దేవి ని ప్రార్థించి తన కుడి చేతికి ఆ రక్షా దారాన్ని కట్టుకొంది రచన . ఎందుకో ఓ క్షణం గిరిజ గుర్తుకువచ్చింది ఆమె కి . అమ్మ ఎలా ఉందొ .. అవును మర్చి పోయాను .. యశ్వంత్ ఇక్కడికొచ్చాడ0టే
ఖచ్చితం గా అమ్మ ని కలిసే ఉంటాడు .. నేనసలు యశ్వంత్ ని అమ్మ గురించి అడగనే లేదు .. వెంటనే యశ్వంత్ ని కలవాలి .. అమ్మ ఎలా ఉందో .. ఏమో .. కనుక్కోవాలి ... అనుకున్న వెంటనే చేతికి  వాచ్ తగిలించుకొని .. రూం తలుపు దగ్గరగా వేసి మెట్లు దిగి హాల్ లోకి వచ్చేసరికి .. రత్నం రాజు ఆమెకోసం వేచి చూస్తూ కనిపించాడు .
అతన్ని చూసి ముఖం లో ఇబ్బంది కనబడనీయ కుండా .. చిరునవ్వు తో హాయ్ .. అంది రచన .
ధాత్రీ .. నీకోసం నాన్న గారు వేచి చూస్తున్నారు .. టిఫిన్ తింటూ మాట్లాడు కుందాం .. అన్నాడు కాస్త ముక్తసరిగా . "ఏంటి ? ఇలా ఉన్నాడు .. భూపతి నాతొ ఏం మాట్లాడతాడు ? అనుకొంటూనే రత్నంరాజు వెనుక భోజనాల బల్ల వైపు
నడిచింది .
భూపతి ఈమెని చూస్తూనే కూర్చోమని చేతితో సంజ్ఞ చేసాడు .
కూర్చున్నాక చెప్పండి .. నాకోసం వెయిట్ చేస్తున్నారట . అంది రచన
ఏమి లేదమ్మాయి .. ఈ ఊరికి నీలాగే మరి కొంత మంది కొత్తవాళ్ళు వచ్చారు .. ఊరిని ఉద్ధరిస్తామంటూ .. అన్నాడు భూపతి .
ఆమె నొసలు చిట్లించి . ఐతే ? అంది రచన .
ముందు నువ్వొచ్చావు .. ఇప్పుడు వాళ్ళు .. మా వూరు ఇప్పుడు చాలా మంది ని ఆకర్షిస్తోంది అనుకో .. అన్నాడు భూపతి .
మీరు సూటిగా చెప్పడం లేదు భూపతి గారూ .. అంది రచన .
నువ్వొచ్చిన పని ఇంకెన్ని రోజులు ఉంది ?అని  అడిగి .. నీకు తిండి పెట్టలేక కాదు .. ఇలా అడుగుతున్నది .. అన్నాడు వెంటనే . భూపతి .
తెలుసు .. నేను ఇక్కడ ఉండటం మీకు ఇబ్బంది కాదు .. కానీ నేనెందుకు వచ్చానో ఆ కారణం మీకు ఇబ్బంది .. భయపడకండి .. భూపతి గారూ .. నేను మీగురించి తప్పు గా పేపర్ లో రాయను .. కానీ మీ గురించి అర్థం చేసుకున్నాను .. నొక్కి వక్కాణి0చింది.. రచన .
నువ్వెందుకు అలా మాట్లాడతావో నాకర్థం కాదమ్మాయ్ .. కానీ నేను నీతో మాట్లాడాలని అనుకున్న విషయం ఐతే ఇది కాదు .. నువ్వీ ఊరికి కొత్త .. ఇంతకు ముందు వచ్చిన ఆ కొత్త వారికీ చెప్పాను .. ఇప్పుడు నీకూ చెబుతున్నాను .. ఈ రోజు అమావాస్య .. ఊరిలో ఎవ్వరు ఈరోజు పగలు  తిరగాలన్నా భయపడతారు . అందుకే చెబుతున్నాను .. ప్రతి అమావాస్య ఒక ప్రాణాన్ని బలి కోరుతుంది ఈ ఊరిలో . కాబట్టి జాగ్రత్త గా ఉండమని చెబుతున్నాను .. అన్నాడు భూపతి .
అసలు ఏమిటి ఇదంతా ? ఎందుకని అమావాస్య నాడు ప్రాణాలు పోతున్నాయి ? నాకేం అర్థం కావటం లేదు .. అంది రచన .
జాగ్రత్త చెప్పటం వరకే .. ఇంకా ఏం మాట్లాడ దలచుకోలేదు నేను . అన్నాడు భూపతి .
ఇంతలో బాలయ్య వచ్చి అయ్యా .. ఆ పట్నం కుర్రోల్లకి ఇల్లు చూపించాను .. వాళ్ళ సరంజామా అంతా ఇంకా ఆ మహల్ కాడే ఉన్నదట .. వెళ్లి తెచ్చు కుందామని పోయిన్రు .. అన్నాడు బాలయ్య .
ఆ సరే .. ఇలా ఎవరెవరో వస్తారు .. ఏదేదో తెలియక చేస్తారు .. ప్రాణాలు పోగొట్టు కుంటారు . దీని వల్ల ఊరికి చెడ్డ పేరు .. అని నసిగి టిఫిన్లు వడ్డిస్తున్న వెంగమ్మ ని చూసి .. వాళ్ళు నలుగురు ఉన్నారు .. వారికి కూడా  భోజనాలు  సిద్ధం చేసి బాలయ్య తో పంపు వెంగమ్మా ... ... అని చెప్పి విసురుగా అక్కడ్నించి లేచి వెళ్లి పోయాడు భూపతి .
(ఇంకా ఉంది )

No comments: