నేనెవరంటే ఏమని చెప్పను ?
నిశ్చల మైన సరస్సులో తరంగమని చెప్పనా ?
మేఘాన్ని కరిగించే చిరుగాలి నని చెప్పనా ?
తొలకరి జల్లు కి మురిసే అవని నని చెప్పనా ..
శిశిరపు విరహాన్ని తాళలేని వనాన్ని కౌగలించే వసంతాన్నని చెప్పనా ?
నింగి వీడి నేల జారిన ముత్యపు చినుకునని చెప్పనా ?
మావిచివురు తిని తీయగ పాడే కోయిలనని చెప్పనా ?
నీలాకాశం లో విహరించే విహంగాన్నని చెప్పనా ?
తొలిపొద్దు కిరణాల చుంబన లో మురిసే జలపాతమని చెప్పనా ?
నెలరేడు ప్రణయ దాహాన్ని తీర్చే కోనేటి కలువనని చెప్పనా ?
అలుపెరగక సాగే నదీమ తల్లి ప్రవాహ వేగాన్నని చెప్పనా ?
తుంటరిగా పూవన మంతా తిరిగే సీతాకోక చిలుక నని చెప్పనా ?
భావాల వెల్లువని కవిత గా మలచే శిల్పి నని చెప్పనా?
ఈ అంతర్జాలం లో ఇంద్రజాలం చేసి మీ మనసుల్ని దోచుకోవాలని వచ్చానని చెప్పనా ?
ఏమని చెప్పను ?
www.facebook.com/Naarachana
4 comments:
అన్నీ చెప్పేసి ఇంకా ఏమని చెప్పను అంటారా ? రాధికా చాలా బాగుంది.
అయ్యో .. ఇంకా ఎన్నో చెప్పాలండి ... ఇంతకీ నన్నేం చెప్పమంటారో మీరు చెప్పనేలేదు శ్రీదేవిగారు
నేను చెప్తాను మీరెవరో... గలగల పారే సెలయేటిలో స్వచ్ఛమైన మాట... మంచు తుంపరలా కరిగిపోయే స్వచ్ఛమైన మనసున్న తరుణి. బాగా ఎక్కువైందంటారా.
ఈ సారికి ఇలా కామెంట్ వచ్చేసింది... ఏం చెయ్యలేం. బాగుందండి... మీ పరిచయం.
సతీష్ గారూ .. మీకు చాలా సార్లు ముందే చెప్పాను . ఇంకొకర్ని ప్రసంసించటం లో మీకు మించిన వారు లేరేమో ..
Post a comment