Powered By Blogger

Wednesday, 3 December 2014

జీవన వాహిని (ఓ కథ )

ఆకాశం అంతా మేఘావృతమై ఉంది .. ఈదురుగాలులు మొదలయ్యాయి . .. సాయంత్రం 4 గం ..

వడివడిగా అడుగులు వేసుకుంటూ పలాస బస్ స్టాప్ చేరుకుంది వాహిని . బస్సు స్టాప్ పక్కనే ఉన్న పాన్ షాప్

అతను ఆమె ని గమనించి .. తుఫాన్ మొదలవుతుంది వాహినీ .. ఈరోజు స్కూల్ సెలవ్ పెట్టి ఇంట్లోనే ఉండలేక

పోయావా ? అన్నాడతను .

ఆమె అతడికి గత 3 ఏళ్ళుగా తెలుసు ..

లేదు బాబాయ్ .. సెలవ్ పెట్టడం కుదరలేదు .. బస్సు వెళ్లిపోయిందా బాబాయ్ ? అంది కంగారుగా ఆమె నల్లని

మేఘాలపై అప్పుడప్పుడు మెరుస్తున్న మెరుపుల్ని చూస్తూ .

ఇంకా రాలేదు .. వస్తుంది .. ఇంతలో బస్సు హార్న్ విని .. వాహినీ .. బస్సు వస్తుంది .. బయల్దేరమ్మా .. అన్నాడు

అతడు .

బస్సు ఆగగానే కంగారుగా హ్యాండ్ బాగ్ ని గట్టిగా ఒడిసి పట్టుకుంటూ బస్సు ఎక్కింది .. ముందర తనే ఎక్కటం

మూలాన సీట్ దొరికింది .. ఆమె వెనుక చాలా మంది ఎక్కినట్టున్నారు .. బస్సు కిక్కిరిసి పోయింది .

హమ్మయ్య .. సీట్ దొరికింది .. అనుకొని తన పక్కన ఉన్న ఆమె వైపు చూసింది వాహిని . ఆమె మొహాన్ని చున్ని

తో పూర్తిగా కప్పుకొని ఉండటం వలన పేస్ కనబడలేదు .

సీట్ పై తల ఆనించి నిశ్చింత గా కళ్ళు మూసుకుంది . " ఆ షకీల్ డబ్బు ఇవ్వడేమో అనుకున్నాను .. ఏదో దశ

బావుండి ఇచ్చాడు .. ఈరోజు తీసుకున్న డబ్బుతో లక్ష రూపాయలు వాడికి బాకీ పడ్డాను . ఏం చేయను ? మరి

నాన్న పోయాక అంతా తలకిందులయిపోయింది .. పి.జి చదవాలన్న తన కోరిక ఆవిరై పోగా కుటుంబ బాధ్యతలు

మీద పడ్డాయి . నాన్న ఉన్నప్పుడే అక్క పెళ్లి జరిగిపోయింది . నాన్న పోయాక చిన్నక్క పెళ్లి నానా పాట్లు పడి

చేయాల్సి వచ్చింది .. కట్నం బాకీ ఇంకా మిగిలే ఉంది .. ఇప్పుడు బావ ఇంట్లో అమ్మ బుర్ర తింటూ ఉండుంటాడు .

యాభై వేలు కావాలని . పాపం కంగారుగా ఉదయం ఫోన్ చేసింది అమ్మ .. ఈ డబ్బు తీసుకు వెళ్లి వాడి మొహం

మీద  కొట్టాలి .. అనుకొంది మనసులోనే వాహిని .

ఇంతలో తన పక్కన ఉన్నామె వాహిని చేతిని గట్టిగా పట్టుకోవడం తో ఆలోచనల్లోంచి బయటకి వచ్చి ఆమె వైపు

చూసింది వాహిని .

ఆమె ముసుగు తీయకుండానే .. ప్లీజ్ .. సేవ్ మీ .. అంది చాలా మెల్లగా వణుకు తున్న స్వరం తో .

వాహిని ఆమె వైపు ఆశ్చర్యంగా చూసింది .. బస్సు టెక్కలి లో ఆగి ఉంది .

కిటికీ లోంచి చూడండి .. అక్కడ కొంత మంది రౌడీలు ఉన్నారుగా .. వారు నన్నే వెతుకుతున్నారు .. అని హిందీ

లో చెప్పింది ఆమె .

వాహిని వారిని చూసింది .. నిజంగానే కొంతమంది చూపుకే గూండాల్లా ఉన్నారు . వారిలో ఒకడు బస్సు లో

అందరికేసి చూస్తుంటే .. ఇంకొకడు జనం దిగగానే బస్సు ఎక్కాడు .

వాహిని బుర్ర మెరుపు లా పనిచేసింది .. ఆమె తలని తన ఒడిలో పెట్టి తన కొంగుతో ఆమె ని కవర్ చేసింది ..

ఎక్కిన వాడు చుట్టూ అందర్నీ పరీక్ష గా చూస్తున్నాడు .. వాహిని తన మొహం లో ఎటువంటి తత్తర పాటు లేకుండా

స్థిరంగా కూర్చుంది .

వాడి చూపు వాహిని ఒడిలో ఉన్న ఆమె పై పడనే పడింది .. ఎవ్వరూ ? అని హిందీలో అడిగాడు .

మేరీ బహెన్ .. క్యూ ? అంది సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ వాహిని .

అతడు వాహిని వైపు అదోలా చూసి .. కుచ్ నై .. అని దిగిపోయాడు వాడు . బస్సు మళ్ళి కదిలింది . కొంచెం దూరం

వెళ్ళాక ఉటో .. అంది వాహిని .

ఆమె మెల్లిగా లేచి .. థాంక్ యు .. అంది .

ఏం జరిగింది ? ఎవరు వాళ్ళు ? మెల్లిగా అడిగింది హిందీలో  ఆమె ని వాహిని .. ఆమె కళ్ళలో బెరుకు చూసి .

ఆమె చుట్టూ భయంగా చూసి .. నెల క్రితం వాళ్ళు నన్ను కిడ్నాప్ చేశారు .. నేను తప్పించుకున్నాను .. అంది

ఆమె హిందీలో .

కిడ్నాపా ? విస్తుపోతూ అడిగింది వాహిని .

ప్లీజ్ కొంచెం మెల్లిగా .. అని చెప్పడం ప్రారంభించింది ఆమె . మాది ముంబాయి .. మా నాన్న గారు పెద్ద వ్యాపారవేత్త .

నా పేరు నిషా . కాలేజీ లో చదువుతున్నాను .. ఓ రోజు కాలేజీ నుంచి వస్తుంటే వెనక నుంచి ఎవరో కర్చీఫ్ పెట్టారు

ముక్కు మీద . అంతే .. కళ్ళు తెరచి చూసేసరికి ఓ పాడుబడ్డ ఇంట్లో ఉన్నాను .. వాళ్ళు నెల రోజులుగా నన్ను

ఎందుకు బంధించి ఉంచారో తెలీదు . కానీ ఈరోజు అదృష్టవశాత్తు గట్టిగా గాలి వీచి నా గది గోడ విరిగిపోయింది ..

నేను తప్పించుకున్నాను .. ఇదే ఏరియా నో నాకు తెలీదు . ఈ బస్సు కనిపించింది ఎక్కేసాను . అన్నదామె

భయంగా .

ముంబై లో నిన్ను కిడ్నాప్ చేసి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో నిన్ను దాచిపెట్టారా ఆశ్చర్యంగా ఉంది . అంది వాహిని .

శ్రీకాకుళం అంటే .. అన్నదామె అమాయకం గా .

ఆంధ్ర .. నువ్వు ఆంధ్రలో ఉన్నావ్ .. అంది వాహిని .

అవునా ? అంటే చాలా దూరం .. నేను మా ఇంటికి వెళ్ళేలోపు వాళ్లకి దొరికి పోతానేమో అని భయంగా ఉంది ..

అంది నిషా .. భయంగా .

ఇంతలో కండక్టర్ .. టికెట్ .. టికెట్ .. అనగానే శ్రీకాకుళం కి రెండు టికెట్స్ ఇవ్వండి .. అని ఆమె కి కూడా టికెట్

తీసుకుంది వాహిని .

ఇంతలో బస్సు మరో స్టాప్ లో ఆగింది .. అక్కడ కూడా కొంత మంది నిషా కోసం వెదకడం గమనించి ఆమె చెప్పింది

నిజమే అని నిర్థారించుకోంది వాహిని .

నిషా భయపడకు .. నేను నీకు సహాయం చేస్తాను .. అని అంది వాహిని .

నిషా చేతులు రెండు జోడించింది . మెల్లిగా వర్షం మొదలైంది . ఈమె ని ముంబై క్షేమం గా ఎలా పంపాలి ? ఈమె

చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు .. ఎలా ? అని ఆలోచించింది . పోనీ వైజాగ్ లో ఫ్లైట్ ఎక్కిస్తేనో .. తుఫాన్ కదూ ..

ఫ్లైట్స్ కూడా కాన్సిల్ అయ్యుంటాయి . ఏం చేయాలి అని ఆలోచిస్తుండగా .. రాము గుర్తొచ్చాడు ఆమె కి .. అంతే

ఏం చేయాలో బోధపడింది ఆమె కి .

బస్సు శ్రీకాకుళం లో ఆగింది . నిషా ని పట్టుకుని బస్సు దిగగానే ఆటో పట్టుకొని 7రోడ్ జంక్షన్ కి పోనీ .. అంది

వాహిని .

ఓ బట్టల షాప్ ముందు ఆటో ఆగాక .. ఇద్దరూ దిగారు . నిషా పద .. అని షాప్ లోకి నడిచింది వాహిని .

ఆమె అయోమయంగా వాహిని ని అనుసరించింది .. షాప్ లోకి వెళ్ళాక .. నీ సైజు డ్రెస్ ఏదన్నా తీసుకో .. ముందు

ఈ డ్రెస్ మార్చెయ్ .. వాళ్ళు గుర్తు పట్టక పోవొచ్చు .. అంది వాహిని .

ఆమె తల ఊపి కాసేపట్లో బట్టలు మార్చుకొని వచ్చింది . బట్టలకి బిల్ పే చేసి .. ఎదురుగా ఉన్న హోటల్ కి

తీసుకెళ్ళి టిఫిన్ ఆర్డర్ చేసింది .. ఎప్పుడు తిన్నవో ఏమో తిను .. అంది వాహిని .

ఆమె వాహిని వైపు చూసి థాంక్ యు .. చాలా ఆకలిగా ఉంది .. అంది . ఆమె అమాయకపు వదనం చూస్తె

బాధ అనిపించింది వాహిని కి . ఆమె టిఫిన్ చేస్తుంటే రాము కి ఫోన్ చేసింది . వీళ్ళ టేబుల్ దగ్గరికి కాసేపట్లో

వచ్చాడు రాము .

అక్కా ? ఏంటి ఏదో అర్జెంటు గా మాట్లాడాలన్నావు ? అని .

రాము .. నువ్వు నాకో సహాయం చేయాలి . ఈ అమ్మాయి అర్జెంటు గా ముంబై వెళ్ళాలి . కానీ మనకి వైజాగ్ లో

ఫ్లైట్స్ ఉండి ఉండవు .. అందుకే విజయవాడ నీ కాబ్ లో తీసుకువెళ్ళు .. నిన్ను నమ్మి ఈ పని నీకు

చెబుతున్నాను .. ఆమె ని ఎయిర్పోర్ట్ లో దగ్గరుండి ఫ్లైట్ ఎక్కించి రా .. అని అతడితో చెప్పింది వాహిని .

కానీ అక్కా .. తుఫాన్ .. మొదలైంది .. ఎలా ? అన్నాడు రాము .

కష్టం లో ఉంది రాము .. మనలాంటి వాళ్ళు సహాయం చేయాలి కదా .. ? అంది వాహిని .

సరే అక్కా .. అన్నాడు రాము . బాగ్లోంచి 10000 తీసి అతడి చేతిలో పెట్టి దారి ఖర్చులకి వాడు అంది వాహిని .

మరో పది వేలు తీసి అనుమానం గా చూస్తున్న నిషా ని చూసి .. రేపు ఉదయం విజయవాడ నుండి ఏ ఫ్లైట్ ఉంటె

ఆ ఫ్లైట్ కి ముంబై వెళ్ళిపో . యితడు నా తమ్ముడు . నువ్వు తనని నమ్మొచ్చు .. ఇదిగో టికెట్ కి డబ్బు ..

అని ఆమె చేతిలో 10000 పెట్టింది వాహిని . ఆమె లో ఇంకా అనుమానం పోలేనట్టు ఉంది .

చూడు నిషా .. నేనీ సహాయం నాకు డబ్బు ఎక్కువై చేయటం లేదు .. నీ కష్టం విన్నాక కష్ట సుఖాలు తెలిసిన

దానిగా నీకీ సహాయం చేయాలనుకున్నాను . నా ఇంటి అవసరాల కోసం అప్పుగా తెచ్చిన డబ్బు . ఎందుకో నీ

అదృష్టం బావుండి భగవంతుడు నిన్ను నాకు కలిసేలా చేసాడు .. ఇది నా ఫోన్ నెంబర్ .. అని నెంబర్ రాసున్న

ఓ కాగితం ఆమె చేతిలో పెట్టి .. ఎక్కువ ఆలస్యం చేయకుండా బయల్దేరు . రాము నీకు సోదరుడే అనుకో .. అంది

వాహిని .

నిషా ప్రేమగా వాహిని ని హత్తుకుంది ..

ఇక మేము బయల్దేరుతాం అక్కా .. తుఫాన్ తీరం దాటక ముందే మేము ఇక్కడ్నుంచి వెళ్ళాలి అన్నాడు రాము .

అందరు కార్ దగ్గరికి నడిచారు . కార్ లో కూర్చున్నాక .. ఏదో గుర్తొచ్చినట్టు అడిగింది నిషా .. ఆప్కా నాం ?

అని .

చిరునవ్వుతో .. వాహిని .. అని చెప్పింది వాహిని .

కార్ దూరమవుతున్నా నిషా వాహిని ని చూస్తూ చేయి ఊపుతూనే ఉంది .

ఇక తుఫ్ఫాన్ ఇంట్లో మొదలవుతుంది .. అని ఇంటికేసి నడిచింది వాహిని .

                                            ****************************

అయినా అంత దయ పనికిరాదే .. 20వేలు .. అయ్యో .. అయ్యో .. నీ రెండు నెలల జీతం కదుటే .. అలా ఎలా ఆ పిల్ల

మాటలు నమ్మి ఇచ్చేసావ్ .. ఆ డబ్బు ఉంటె మీ బావ కట్నం బాకీ పూర్తిగా తీరిపోయేది కాదే .. గట్టిగా అరుస్తుంది

సుశీలమ్మ .

అమ్మా .. అది జరిగి వారం అవుతుంది .. అయినా నువ్వింకా వదలటం లేదు . ఏదోలా ఆ మిగతా డబ్బు నేను

సర్దుబాటు చేస్తానమ్మ .. నాకీ రోజు భాష్యం స్కూల్ లో ఇంటర్వ్యూ ఉంది ఆశీర్వదించి పంపమ్మా .. అంది వాహిని .

సుశీలమ్మ కోపంగా వంటింట్లోకి వెళ్లి పోతూ .. తనకి మాలిన ధర్మం పనికి రాదు .. అంది .

అక్కా .. అమ్మ కోపం ఎన్నాళ్ళు కానీ .. ఆ అమ్మాయి కింద అంత డబ్బు ఖర్చుపెట్టావు ఎందుకు ? అంది చెల్లెలు

మాన్విక .

మాన్వి .. ఆ అమ్మాయికి నీ వయసే ఉంటుంది .. అయినా నాన్న ఎప్పుడూ చెప్పేవారు కదా సాటి వాళ్లకి

సహాయం చేస్తే భగవంతుడు మనకి ఇంకో విధంగా సహాయం చేస్తాడని . అంది వాహిని .

ఇంతకీ ఆ అమ్మాయి  క్షేమం గా ముంబై చేరిందా ? అని అడిగింది మానవిక .

ఆరోజు ఫ్లైట్ ఎక్కేముందు ఫోన్ చేసింది .. చేరాక లేదు . అయినా తుఫాన్ వల్ల నెట్వర్క్ అంతా చెడిపోయింది కదా ..

ఆమె క్షేమం గా వెళ్ళిందనే అనుకుంటున్నాను అంది వాహిని .

అక్కా .. అక్కా .. అని పరుగున వచ్చాడు రాము ..

రాము అన్న వచ్చినట్టు ఉన్నాడు అక్కా .. అంది వీధిలోకి చూస్తూ మాన్వి .

గుమ్మానికి ఎదురెళ్ళి .. వీడెందుకు వచ్చాడు ? అమ్మ వీడ్ని చూస్తే ఇద్దర్ని కలిపి మల్లి తిడుతుంది .. అనుకుంటూ

వెళ్ళిన వాహిని ని  చూసి . అక్కా .. ఎవరొచ్చారో చూడు .. నిషా .. అంటూ వగరుస్తూ అన్నాడు రాము .

నిషా నా .. అని ఆశ్చర్యంగా అని కార్ దిగుతున్న నిషా ని చూసి .. నిజమే .. అంది వాహిని .

నిషా .. అంటే ఆ అమ్మాయే కదక్కా .. అంది మాన్వి .

అవును మాన్వి .. వాళ్ళు అక్క ని వెదుక్కుంటూ వచ్చారు . నాకు ఫోన్ చేశారు .. ఈ రోజు ఫోన్స్ కలిసాయి ..

కదా .. వాళ్ళు ఫోన్ చేయగానే నేను వాళ్ళని కలిసి ఇంటికి తీసుకొచ్చేసా .. రాము మాన్వి తో ఏదో చెబుతూనే

ఉన్నాడు .

నిషా పరుగున వచ్చి వాహిని ని హత్తుకుంది .. నిషా .. ఇక్కడికి ఎందుకు వచ్చావ్ మళ్ళి ? మళ్ళి నువ్వు ఆ రౌడీ

ల కళ్ళల్లో పడితేనో .. అంది వాహిని కంగారుగా .

నేనొక్కదాన్నే కాదు దీదీ .. పాపా , భయ్యా ఇద్దరూ నాతొ వచ్చారు . ఆ రౌడీలను పోలిస్ లు పట్టుకున్నారు .. ఇక

భయం లేదు .. ఫాస్ట్ గా చెప్పేసింది నిషా .

ఇంతలో కార్ దిగిన ఓ యువకుడు , ఓ పెద్దాయన వీరి వద్దకి వచ్చారు .

భేటీ .. బహుత్ బహుత్ షుక్రియా .. అన్నాడు ఆ పెద్దాయన చేతులు జోడించి  . అతడు నిషా తండ్రి అయుంటాడు

అనుకొని ..

పెద్దవారు .. మీరిలా నాకు నమస్కరించటం ఏంటీ ? ఇంట్లోకి రండి .. అని వాళ్ళని ఆహ్వానించింది  వాహిని .

మాన్వి చెప్పినట్లుంది .. సుశీలమ్మ కూడా వీరికి ఎదురుగా వచ్చి ఆహ్వానించింది .

అందరూ కూర్చొని టీలు కాఫీలు అయ్యాక .. ఆ పెద్దాయన అన్నాడు . నువ్వు చేసిన సహాయం ఏంటో నీకు

తెలీదు తల్లీ . నిషా మా అందరి ప్రాణం . తన జాడ తెల్సుకోవడానికి మేము చెయ్యని ప్రయత్నం లేదు .. పూర్తిగా

ఆశ వదిలేసుకున్నాం .. నువ్వు మా ఇంటి లో చీకటిని పారద్రోలావ్ తల్లీ .. అన్నాడు అతను .

చిన్న చిరునవ్వు నవ్వి ఊరుకుంది వాహిని .

మా అక్క అంతే నండి .. చాలా మంచిది .. అందరికి సహాయం చేస్తుంది .. అన్నాడు రాము .

తల్లీ నువ్వు చేసిన సహాయానికి వెల కట్టలేను గానీ .. మా సంతోషం కొద్దీ ఇస్తున్న కానుక అనుకో .. ఈ 50లక్షలు

తీసుకో తల్లీ .. అని ఓ సూట్ కేసు ఆమె ముందు పెట్టాడు అతడు .

క్షమించండి .. మీ నుండి ఏదో ఆశించి నేను నిషాకి ఆ సహాయం చేయలేదు .. కష్టం లో ఉన్న ఆడపిల్ల ని చూస్తూ

ఊరుకోలేక నా కర్తవ్యమ్ నేను నిర్వర్తించాను .. దయచేసి ఇలా డబ్బిచ్చి నన్ను బాధపెట్టకండి .. అంది వాహిని .

అతడు వాహిని వంక అచ్చెరువొందుతూ చూసి .. సుశీలమ్మ ని చూసి .. రెండు చేతులు జోడించి .. అమ్మా ..

మీరెంత గొప్పవారు .. ఇలాంటి బిడ్డ ని కన్న మీరు మహనీయులు . ఈరోజు ఈ బంగారు తల్లి ని చూస్తుంటే  నాకు

ఎంతగానో ఆనందం గా ఉంది . మీకు ఆజన్మాంతం ఋణపడి ఉంటానమ్మ .. అని గాద్గద స్వరం తో అంటున్న

అతడిని చూసి .. తన కూతురు వైపు గర్వం గా చూసింది సుశీలమ్మ .

నాన్నా .. ఆమె ని డబ్బిస్తామని చెప్పి కించపరచడం తప్పు .. తిరిగి ఆమె నే ఇంకో సహాయం అడుగుదాం ..

అన్నాడు నిషా అన్న .

అడగండి .. ఏ సహాయం కావాలి ? అన్నది వాహిని .

అందం తో పాటు ఎంతో ఉన్నత వ్యక్తిత్వం ఉన్న మీరు నన్ను పెళ్లి చేసుకోగలరా ? అని అడిగాడు అతడు .

వహ్ .. భయ్యా .. అలా జరిగితే ఎంత బావుంటుంది ? అంది నిషా సంతోషం గా .

ఒక్కసారిగా అవాక్కయింది .. వాహిని .

అవునమ్మా .. నీలాంటి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి మా ఇంటి కోడలిగా వస్తే మాకు సంతోషం . నా కొడుకు కోరిక

కాదనకు తల్లీ .. అన్నాడు పెద్దాయన .

కానీ మాకూ మీకూ .. అని ఆగిపోయింది సుశీలమ్మ .

అమ్మా .. ఏ బంధం ఉన్నదని మీ అమ్మాయి మా నిషా ని కాపాడింది ? మీరు సహాయం చేసినందుకు కాదు వాడు

మిమ్మల్ని అలా అడిగింది ? వాడి కళ్ళల్లోవాహిని  పట్ల ఇష్టం కనబడుతుంది .. వాహిని ఆత్మాభిమానం నచ్చి

అడుగుతున్నాడు .. అన్నాడు పెద్దాయన .

కానీ నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి .. నా చెల్లెలు .. చదువు , పెళ్లి .. ఇవన్నీ . నా బాధ్యతలు అన్నీ వదిలేసి

మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను .. అంది వాహిని .

సుసీలమ్మ వాహిని వైపు బాధగా చూసింది .

పెళ్లి తర్వాత మీకెలా మరికొన్ని బాధ్యతలు వచ్చిపడతాయో .. నాకూ అంతే వాహిని జి . మీరొప్పుకుంటే పెళ్లి

తరువాత నాకు నిషా ఎంతో మీ చెల్లెలు అంతే .. నా చెల్లెలి పట్ల నేను బాధ్యతలని నిర్వర్తించ వచ్చు .. అన్నాడు

అతడు ..

కానీ .. అని వాహిని అనబోతుండగా .. సుశీలమ్మ .. ఇంకా కాదనకు తల్లీ .. ఆ భగవంతుడే నీ మంచి మనసుకి

మెచ్చి ఇలా చేసాడేమో . వారంత పెద్దమనసుతో అడుగుతున్నారు .. కాదనకు .. ఈ పెళ్ళికి అంగీకరించు ..

అంది సుసీలమ్మ .

తల్లి మాటతో మౌనం గా తల ఊపింది  వాహిని .

సాయంత్రం వరకూ వీరితో గడిపి త్వరలోనే మళ్ళి వస్తామంటూ సెలవు తీసుకొని వాళ్లు కార్ ఎక్కి కూర్చున్నాక

ఏదో గుర్తొచ్చినట్టు అడిగింది వాహిని .. ఆప్ కా నామ్ ? అని .

జీవన్ .. మీకు నచ్చిందా ? అని కొంటె గా అడిగాడు అతడు . కార్ ముందుకి దూసుకుపోయింది .. వాహిని చేయి

ఊపుతూనే ఉంది .

అక్కా .. ఇంతమంచి వాళ్ళు .. నువ్వారోజు ఆ అమ్మాయి కి సహాయం చేయక పోయుంటే .. అంతా మామూలే ..

నువ్వు చేసిన సహాయం నీ జీవితాన్నే మార్చేసింది అక్కా .. అని మాన్వి వాహిని బుగ్గ పై ప్రేమగా ముద్దు

పెట్టుకుంది .

చిరునవ్వు నవ్వింది వాహిని .. తన జీవన వాహిని చేరనున్న మలుపు తల్చుకుని .

                                                   **************************
                                                                                                                         రాధిక  


మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

7 comments:

మహి said...

కధ బాగుందండీ.

రాధిక said...

Thank you mahi garu. And welcome to my blog

Anonymous said...

Nice story line raadhika garu

Anonymous said...

very nice

రాధిక said...

Thank you..and welcome to my blog

naresh said...

Ee Story lo malli manavathvam inka bathike undani gurthuchesinanduku meeku kruthagnathalu

రాధిక said...

Prati okkarilo manavatwam untundandi. Kani swaartham kuda untundi kada. Avi okkosari oka daanni okati overtake chesthuntaayi. Anthe. Maanavatwam gelichinappudu manushula mavutaam. Swaartham gelichinappudu raakshasula mavutaam.