Powered By Blogger

Wednesday, 31 December 2014

నూతన సంవత్సర శుభాకాంక్షలు ..


అరె మొన్న మొన్ననే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నాం .. అప్పుడే సంవత్సరం గడచిపోయిందా ? ఆశ్చర్యం గా ఎవరో ఎవరితోనో అంటున్నారు .. విన్న నాకు నవ్వు వచ్చింది .. నిజమే .. కాల చక్రం గిర్రున తిరిగి పోయింది .. 
అవును మరి .. ముందుకు సాగటమే తప్ప వెనక్కి చూడటం అలవాటు లేదుగా కాలానికి .. తన పని తాను 
చేసుకు పోతుంది .. 
ఎందరి ఆశలకి రెక్కలు తొడిగాను ? ఎందరి జీవితాలను ఒడ్డుకి చేర్చాను ? ఎందరి మనస్సులో ప్రేమని రగిల్చాను ?
ఎందరి విజయాలకి నాంది పలికాను ? ఎందరి పెదవుల్లో నవ్వుల పూలు పూయించాను ? అంటూ పొంగి పోదు .. 

ఎందరి జీవితాల్ని అతలాకుతలం చేశాను ? ఎందరికి ఓటమిని రుచి చూపాను ? ఎందరి ఆశయాల్ని మట్టిలోకి 
తొక్కాను ? ఎందరి మదిలో వేదనల్ని మిగిల్చాను ? ఎన్ని దుస్సంఘటన లను మోసుకెల్తున్నాను ? అంటూ 
లెక్కలు వేయదు .. మంచైనా , చెడైనా ముందుకి సాగటమే కాలం మనకి నేర్పేది . 
నిజమే .. ఎండ , వాన కలసి నపుడే నింగి , నేల ని కలిపే హరివిల్లు కనువిందు చేస్తుంది .. కష్టం , సుఖం కలగలసి 
నపుడే జీవితం వికసిస్తుంది , బంధాలు పరిపూర్ణ మవుతాయి .. 

2014 లో విషాదాలను వదిలేద్దాం .. మంచి సంఘటనలను జ్ఞాపకాలుగా మార్చేద్దాం .. కన్నీటిలో కొట్టుకు పోయిన 
వారిని ఒడ్డుకి చేర్చడానికి ప్రయత్నిద్దాం .. మనిషి ఎపుడూ ఆశావాదే .. కొత్త సంవత్సరపు రాక ని మరింత 
ఉత్సాహం గా ఆహ్వానిద్దాం .. అంతా మంచే జరగాలని మనస్ఫూర్తి గా కాంక్షిద్దాం . 
విశాఖ కి మిగిలిన విషాద మయినా , నిన్నో , మొన్నో జరిగిన విమాన ప్రమాదం అయినా కాలం గుండె లో  గుబురు 
కట్టిన ఆవేదనే అనుకుందాం .. గతం మిగిల్చిన అనుభవాలని పాఠాలుగా మలచుకుందాం .. స్వాగతం చెబుతున్న 
భవిత ని మనసారా హత్తుకుందాం .. ఎందుకంటే మనం మనుషులం .. ఆశ  అనే ఆక్సిజన్ పీలుస్తున్న మనుషులం 
... అందుకే ఎల్ల వేళలా శుభాన్నే కోరుకుందాం .. ఉరుకుల పరుగుల జీవితం లో ఇరుక్కు పోయిన మనసులతో 
మన కోసం మరెన్నో అందమైన రోజుల్ని మోసుకొస్తున్న నూతన సంవత్సరానికి సాదరం గా స్వాగతం చెప్దాం .. 

 ఈ నూతన సంవత్సరం మీ మీ జీవితాలలో సరికొత్త వెలుగులు నింపాలని , కొత్త ఆశల్ని చిగుళ్ళు తోడిగేలా 
చేయాలని , ఆద్యంతం బంధాలను దగ్గర చేస్తూనే ఉండాలని , ఆనందాల మతాబులు మీ ఇంటి ముంగిట 
వెలుగుతూనే ఉండాలని .. మరపు రాని మధుర జ్ఞాపకాలని మీ మనసు ఖాతాలో వేయాలని .. మీ కోరికలన్నీ 
(మంచివైతేనే సుమండీ ) ఈ 2015 లో నెరవేరాలని మనసారా కోరుకుంటూ .. మీకు .. మీ కుటుంబాలకి .. 
నూతన సంవత్సర శుభాకాంక్షలు .. 

      wishing you all a very happy new year 2015
                      

                                                                                              మీ  రాధిక ఆండ్ర   


మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

No comments: